గర్భంలో ఉన్న శిశువు రోగనిరోధక శక్తి నిర్మాణం

 

గర్భిణి అయిన స్త్రీ తన కడుపులో ఉన్న శిశువు ఆరోగ్యం కోసం సరైన ఆహారం తీసుకోవాలి. శిశువు యొక్క శరీర భాగాలు, మెదడు అభివృద్ధి, రోగనిరోధక శక్తి గర్భిణి స్త్రీ ఆహారపు అలవాట్లపై ఆధారపడి ఉంటాయి.

గర్భిణీ స్త్రీ తన శిశువు  రోగనిరోధక శక్తి అభివృద్ధి చెందడానికి కావాల్సిన ఆహారం తీసుకోవాలి. సరైన ఆహారం తీసుకోకపోతే శిశువు తెల్లరక్తకణాల అభివృద్ధిపై అవరోధం ఏర్పడుతుంది. తెల్లరక్తకణాలు రోగనిరోధక శక్తికి ప్రధాన కారకాలు.

గర్భధారణ సమయంలో మీరు తీసుకునే ఆహారాన్ని బట్టి బిడ్డ పుట్టిన తరువాత తను పలు అలర్జీలకు గురయ్యే ప్రమాదం ఉంది.

 

సాధారణంగా పుట్టే బిడ్డ కొంత బ్యాక్టీరియాతో ఈ ప్రపంచంలోకి వస్తాడు. తల్లి కడుపులో ఉన్నప్పుడే ఆ బ్యాక్టీరియాతో పోరాడే రోగనిరోధక శక్తి కలిగి ఉంటాడు. ఆ రోగనిరోధక శక్తి తల్లి నుండి వస్తుంది. గర్భిణి మంచి పోషకాలు అందిస్తే రోగనిరోధక శక్తి బాగా పెరుగుతుంది.

విటమిన్‌ -డి కలిగిన ఆహారాలు : చేపలు, తృణధాన్యాలు, గుడ్లలో విటమిన్‌- డి దొరుకుతుంది. గర్భధారణ సమయంలో వారానికి 2 సార్లు చేపలు తినాలి. కానీ మిథైల్‌మెర్య్కూరీ అధికంగా ఉన్న చేపలను తినకూడదు. అవి శిశువు మెదడు నిర్మాణానికి అడ్డుపడచ్చు.

 

జింక్‌ కలిగిన ఆహారాలు : శిశువు డిఎన్‌ఏ తయారు కావడానికి, పని చేయడానికి, కణాజాల నిర్మాణం జరగడానికి జింక్‌ ఉపయోగపడుతుంది. జింక్‌ అనేది పాల ఉత్పత్తుల్లో, బీన్స్‌, తృణధాన్యాలు, బ్రెడ్డులలో లభిస్తుంది. ఆయిశ్చర్స్‌లో ( సముద్రపు చేపలలో ఒక రకం)  అత్యధిక జింక్‌ లభిస్తుంది కానీ మెర్క్యూరీ అధికంగా ఉంటుంది కనుక గర్భిణీ స్త్రీలు తినకూడదు.

సాల్మన్‌ చేపలు : వండిన సాల్మన్‌ చేపలను తినవచ్చు. ఎందుకంటే అవి గర్భిణీ స్త్రీలకు కావాల్సిన ప్రొటీన్లు, కాల్షియం, ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగి ఉంటాయి. ఇవి శిశువు మెదడు పెరుగుదలకు చాలా ముఖ్యం. అలాగే ఇవి యాంటీ ఆక్సిడెంట్స్‌గా కూడా పని చేస్తాయి. యాంటీ ఆక్సిడెంట్లు మలిన, విషపు పదార్థాలను శరీరం నుండి బయటకు పంపేస్తాయి.

పండ్లు, కూరగాయలు : గర్భంతో ఉన్న స్త్రీలు పండ్లు, కూరగాయలు కూడా వాటి గురించి తెలుసుకొని అలెర్జీలాంటి సమస్యలు రాకుండా ఉండేవి మాత్రమే తినాలి. పచ్చని, పసుపు పచ్చని కూరగాయలు, నిమ్మ పండ్లు చిన్నప్పుడే వచ్చే తామరను నివారిస్తాయి. ఆకుకూరలు, యాపిల్‌ పండ్లు చిన్నతనంలో వచ్చే ఆస్తమా (శ్వాసకు సంబంధించిన వ్యాధి)ను నివారిస్తాయి. తినేముందు పండ్లను, కూరగాయలను శుభ్రం చేయడం మరచిపోకండి.

బలమైన రోగనిరోధక శక్తి శిశువుకు కలగాలంటే ఎర్రరక్తకణాలకు పోషకాలు అందాలి. ఆకుపచ్చని కూరగాయల్లో ఫైబర్‌, విటమిన్లు, కాల్షియం, ఐరన్‌, ఫోలేట్‌, పొటాషియం తదితర పోషకాలు లభిస్తాయి.

విటమిన్‌ సి శిశువుకి రోగకారక క్రిముల నుండి రక్షణ కల్పిస్తుంది అలాగే యాంటీ ఆక్సిడెంట్‌గా పని చేసి కణజాలాన్ని అభివృద్ధి పరుస్తుంది. ముఖ్యంగా నిమ్మ పండ్లు, ఆకు కూరలు, తృణధాన్యాలలో విటమిన్‌ సి లభిస్తుంది. కానీ తాజాగా తీసుకోవాలి.

ఇండియన్‌ గూస్‌బెర్రీ ( ఆమ్లా) లో విటమిన్‌ సి పుష్కలంగా లభిస్తుంది. నారింజ పండ్లకంటే 20 రెట్లు అధికంగా విటమిన్‌ సి లభిస్తుంది అలాగే ఐరన్‌, కాల్షియం, కెరటీన్‌లు కూడా లభిస్తాయి.

ఆరోగ్యకరమైన క్రొవ్వు  : 2017 పరిశోధనల ప్రకారం కడుపులో ఉన్న శిశువు సూక్ష్మ క్రిములతో పోరాడటానికి కావలసిన రోగనిరోధక శక్తి ఆరోగ్యకరమైన మోతాదులో క్రొవ్వును ఆహారంలో తీసుకోవడం ద్వారా లభిస్తుంది. కావున మంచి క్రొవ్వు గల  కొబ్బరినూనె, చేపలు, గుడ్లు లాంటివి ఆహారంలో తీసుకోవాలి.

ఇన్స్‌టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియన్‌ మదర్‌ అండ్‌ చైల్డ్‌ హెల్త్‌ వారి నివేదిక ప్రకారం తల్లి బిడ్డల క్షేమం కోసం పచ్చి మాంసం, పచ్చి చేపలు, పచ్చి గుడ్లను తినకూడదు. ఎందుకంటే వాటిలో హాని కలిగించే బాక్టీరియా ( సూక్ష్మక్రిములు) శిశువు యొక్క లివర్‌ (కాలేయం) కణాలను దెబ్బతీసి రోగనిరోధక శక్తిని తగ్గిస్తాయి.

నట్స్‌  : నట్స్‌ ( ముఖ్యంగా బాదంపప్పులు, జీడిపప్పులు లాంటివి) రోగనిరోధక శక్తిని పెంపొందించేందుకు బాగా ఉపయోగపడతాయి. ముఖ్యంగా వెజిటేరియన్‌ ( మాంసం, చేపలు తిననివారు) అయితే జీడిపప్పులో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్‌ లభిస్తుంది. వీటిని ఏ ఆహారంలోనైనా కలిపి తినవచ్చు.

పాల ఉత్పత్తులు : పాల ఉత్పత్తులలో కాల్షియం అధికంగా లభిస్తుంది. కాబట్టి కాబోయే తల్లికి ఆహారంగా వీటిని విరివిగా అందజేస్తారు. కాల్షియం తల్లి యొక్క యముకల శక్తికి అలాగే బిడ్డ యముకలు, పండ్ల అభివృద్ధికి సహకరిస్తుంది. పాలు, తక్కువ క్రొవ్వు గల  పెరుగులలో కాల్షియం, ప్రొటీన్‌లు లభిస్తాయి.

గుర్తుంచుకోవలసిన విషయాలు :

తాజా పండ్లు, కూరగాయలు, సమతులాహారం తీసుకోవాలి. అలాగే వేయించిన పదార్థాలు, చక్కెర, బ్రెడ్‌, కేకులు లాంటివి తగ్గించాలి.

క్రిమిసంహారక మందులతో పండిన ఆహారాన్ని తగ్గించి సేంద్రీయ పద్ధతులలో పండిన ఆహారాన్ని తీసుకోవాలి. క్రిమిసంహారక మందులు బిడ్డ రోగనిరోధక శక్తిని తగ్గించి అలర్జీలకు గురి చేయవచ్చు.

మీకు పొగ తాగే అలవాటు ఉంటే వెంటనే గర్భంతో ఉన్నప్పుడు మానేయండి. లేకపోతే శిశువుకు ఆస్తమా వచ్చే ప్రమాదం అలాగే గర్భస్రావం కలిగే అవకాశం ఉంటుంది.

7,8 గ్లాసుల నీరు ప్రతి రోజు తాగాలి. నీరు ఇన్‌ఫెక్షన్ల నుండి రక్షిస్తుంది. అలాగే యాంటీబయాటిక్స్‌ వల్ల వచ్చే సైడ్‌ ఎఫెక్స్‌ నుండి కాపాడుతుంది.

గతంలో గర్భిణి తను ఆహారంలో తగు పోషకాలు లభిస్తాయా లేదా అన్న విషయంపై మాత్రమే దృష్టి ఉండేది. కానీ పరిశోధనల ప్రకారం తల్లి ఆహార పద్ధతుల వలన బిడ్డ రోగనిరోధక శక్తి ఆధారపడుతోందని స్పష్టమైంది. గర్భంతో ఉన్న స్త్రీకి అలాగే బిడ్డకు కూడా రోగనిరోధక శక్తి అవసరం. ఇలా ఆహారం పోషకాలను అందివ్వడమే కాకుండా ఎన్నో విషయాల్లో తన పాత్ర వహిస్తుంది.

మూలాలు:

Penders J, Thijs C, Vink C, Stelma FF, Snijders B, Kummeling I, van den Brandt PA, Stobberingh EE. 2006. Factors Influencing the Composition of the Intestinal Microbiota in Early Infancy. Pediatrics 118(2), 511-21.

Walker WA. (2013). Initial intestinal colonization in the human infant and immune homeostasis. Annals of Nutrition and Metabolism, 63 (Suppl. 2), 8-15.

Riang R, Nangulu A and Broerse J. “When a woman is pregnant, her grave is open” health beliefs concerning dietary practices among pregnant Kalenjin women in rural Uasin Gishu County, Kenya. Journal of Health, Population and Nutrition 2017; 36:53. DOI 10.1186/s41043-017-0130-0

Andrew J. Macpherson, Mercedes Gomez de Agüero and Stephanie C. Ganal-Vonarburg. How nutrition and the maternal microbiota shape the neonatal immune system. Nature reviews. 2017; 17: 508-517.

Venter C, Brown KR, Maslin K, Palmer DJ. Maternal dietary intake in pregnancy and lactation and allergic disease outcomes in offspring. Pediatr Allergy Immunol 2017: 28: 135–143.

Nurmatov U, Devereux G, Sheikh A. Nutrients and foods for the primary prevention of asthma and allergy: systematic review and meta-analysis. J Allergy Clin Immunol 2011: 127: 724–33.