గర్భధారణ సమయంలో ఆహారం - అపోహలు, సలహాలు

గర్భధారణ సమయంలో ఆహారం - అపోహలు, సలహాలు

 

తల్లి కాబోయే ప్రతి స్త్రీకి తెలిసినవారు, తెలియనివారు కూడా ఆహార నియమాల గురించి అనేక విషయాలు చెబుతుంటారు.  ఏ ఆహారం తినాలి, ఏ ఆహారం తినకూడదు, అసలు ఆహారం తల్లికి, బిడ్డకు ఏ విధంగా మేలు, కీడు చేస్తాయో సలహాలిస్తుంటారు. ఆ సలహాలలో కొన్ని మంచి ఫలితాలనిస్తాయి కూడా. కానీ ఈ సలహాలన్నీ కొన్ని దశాబ్దాలుగా మన పూర్వీకుల నుండి వచ్చినవే.

ప్రస్తుతం మనం గర్భధారణ సమయంలో ఏ సలహాలు  మేలు చేస్తాయో, కీడు చేస్తాయో తెలుసుకుందాం.

అపోహ #1- బొప్పాయిని గర్భిణీ స్త్రీలు తినకూడదు :

బొప్పాయి తినడం వలన గర్భస్రావం అవుతుందనేది ఎంతమాత్రం నిజం?

బొప్పాయిలో లాటెక్స్‌ అనే పదార్థం ఉంటుంది. గర్భిణీ స్త్రీలు బొప్పాయి తింటే ఈ లాటెక్స్‌ అనే పదార్థం వలన గర్భసంచి సంకోచించడం లేదా గర్భస్రావం అవుతుంది. పచ్చి బొప్పాయిలో  పండు బొప్పాయి కంటే ఎక్కువ లాటెక్స్‌ ఉంటుంది. అందువలన బొప్పాయి మాత్రమే కాదు బొప్పాయి తోలు లేదా గింజలు కూడా తినకూడదు.

పండు బొప్పాయిలో తక్కువ శాతం లాటెక్స్‌ ఉంటుంది. అంతేకాక పండు బొప్పాయి తినడం వలన విటమిన్‌ ఏ, బి, సి, ఈ, బీటా కెరోటీన్‌, ఫోలిక్‌ యాసిడ్‌, పీచు పదార్థాలు లభిస్తాయి కనుక అతి తక్కువ పరిమాణంలో తల్లి ఆహారంగా తీసుకోవచ్చు. శరీర రోగనిరోధక శక్తి మెరుగవడానికి, శిశువు పెరుగుదలకు విటమిన్‌ బి చాలా ముఖ్యం. పండు బొప్పాయి మలబద్ధకాన్ని, ఉబ్బరాన్ని, గ్యాస్ట్రిక్‌, గుండెలో మంట లాంటి సమస్యలను తగ్గించేందుకు సహాయపడుతుంది.

అపోహ #2- కెఫీన్‌ తీసుకోవడం వలన గర్భస్రావం అవుతుంది.

కెఫీన్‌ సాధారణంగా టీ, కాఫీ, చాకొలేట్‌ లాంటి ఆహార పదార్థాలలో దొరుకుతుంది. గర్భధారణ సమయంలో కెఫీన్‌ తీసుకోవడం వలన అతిమూత్ర వ్యాధి, రక్తపోటు, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటి సమస్యలు వస్తాయి. అతిమూత్ర వ్యాధి వలన శరీరంలో నీటి శాతాన్ని కోల్పోవలసి వస్తుంది.

ఏ ఆహారమైనా అధికంగా తీసుకుంటే హాని కలుగుతుంది. కాబోయే తల్లి ప్రతి రోజు 200 మిల్లీ గ్రాముల కెఫీన్‌ను (ఒక కప్పు కాఫీ) తీసుకోవచ్చు. కెఫీన్‌ను పరిమితంగా తీసుకోవాలి. ఎందుకంటే ఎక్కువ మోతాదులో తీసుకుంటే గర్భస్రావం కలుగవచ్చు.

అపోహ #3- వేరుశనగపప్పులు ఆహారంగా తీసుకోవడం వలన పుట్టబోయే బిడ్డకు కొన్ని రకాల అలెర్జీలు వచ్చే అవకాశం ఉందంటారు. కానీ అది నిజం కాదు. వేరుశనగపప్పులలో విటమిన్‌ ఈ, ఫోలేట్‌, ప్రొటీన్లు ఉంటాయి. తల్లి కాబోయే ముందు వేరుశనగపప్పులంటే అలర్జీ లేకుంటే గర్భిణీ స్త్రీ  వేరుశనగపప్పులను పోషకాహారంగా తీసుకోవచ్చు.

అపోహ #4- గర్భిణీ స్త్రీలు చేపలను తినకూడదు

చేపలలో ఒమేగా-3, విటమిన్‌ డి, బి2 తదితర పోషకాలు లభిస్తాయి. కానీ కొన్ని రకాల చేపలను అనగా మెర్క్యురీ పదార్థం ఎక్కువగా ఉండే చేపలను తినకూడదు.

సురక్షితమైన చేపలు : ష్రింప్‌, క్యాన్డ్‌ లైట్‌ టునా, సాల్మన్‌, పొల్లాక్‌, క్యాట్‌ ఫిఫ్‌.

హాని కలిగించే చేపలు : షార్క్‌, స్వోర్డ్‌ ఫిష్‌, టైల్‌ ఫిష్‌, కింగ్‌ మేకరిల్‌.

సప్లిమెంట్‌గా ఇచ్చే ఫిష్‌ ఆయిల్‌ పెరగుతున్న  శిశువుకు మంచి పోషకాలను అందజేస్తుంది.

అపోహ #5- స్పైసీ ఫుడ్‌ (అధిక మోతాదులో మసాలాలు కలిగిన ఆహారం) వలన గర్భస్రావం అవుతుంది.

గర్భిణీ స్త్రీలు సర్వ సాధారణంగా కొన్ని సమయాలలో గుండెల్లో మంటతో బాధపడుతుంటారు. కాబట్టి స్పైసీ ఫుడ్‌ తీసుకోకూడదు. కానీ ఇప్పటివరకు స్పైసీ ఫుడ్‌ వల్ల గర్భస్రావం అయినట్లు ఏ దాఖలాలు లేవు. పలు రకాల ఆహారం తినాలన్న కోరికలు గర్భిణీలలో ఎక్కువగా ఉంటుంది కానీ ఎలాంటి ఆహారమైనా మితంగా తీసుకుంటే తల్లికి బిడ్డకు ఇరువురికీ మంచిది.

అపోహ #6- నెయ్యి తినడం వలన ప్రసవం సులభంగా అవుతుంది.

మన పూర్వీకుల నుండి వచ్చిన సాధారణ సలహా ఇది. నెయ్యి ఆహారంలో భాగం చేసుకుంటే ప్రసవ సమయంలో గర్భాశయం మృదువుగా తయారయ్యి సులభంగా ప్రసవం అవుతుంది. నెయ్యిలో అనేక పోషకాలు లభిస్తాయి. తక్షణ శక్తి కోసం నెయ్యిని ఆహారంతో పాటు తీసుకోవాలి కానీ పచ్చిగా తాగకూడదు.

అపోహ #7- కొబ్బరి నీరు త్రాగడం వలన పుట్టే బిడ్డకు మంచి రంగు, దట్టమైన వెంట్రుకలు వస్తాయి.

గర్భిణీ స్త్రీలకు కొబ్బరి నీరు వలన వచ్చే లాభాల గురించి అనేక సలహాలు ఇస్తుంటారు. పుట్టే బిడ్డకు మంచి రంగు వస్తుందని, దట్టమైన వెంట్రుకలు వస్తాయని చెబుతుంటారు. కానీ తల్లిదండ్రుల జీన్స్‌ (జన్యువులు) వల్లే పుట్టే బిడ్డ రూపాంతరం చెందుతుంది కానీ కొబ్బరి నీటి వలన ఏమాత్రం కాదు అని సైన్స్ (శాస్త్రం) చెబుతోంది. కొబ్బరి నీరులో అధిక పీచు పదార్థం, మెగ్నీషియం లభిస్తుంది. కనుక కొబ్బరి నీరు త్రాగటం వలన మలబద్ధకం తగ్గిపోతుంది అలాగే శరీరంలో నీటి శాతాన్ని క్రమబద్ధీకరిస్తుంది.

అపోహ #8- కుంకుమ పువ్వు బిడ్డ శరీర రంగును ప్రభావితం చేస్తుంది.

కుంకుమ పువ్వును పాలలో కలుపుకొని త్రాగటం వలన పుట్టబోయే బిడ్డకు మంచి రంగు వస్తుందనేది మనకు, మన పూర్వీకులకు ఉండే బలమైన నమ్మకం. కానీ ఇది అపోహ మాత్రమే. గర్భధారణ సమయంలో గర్భిణి యొక్క చర్మం పొడిగా, నిర్జీవంగా తయారౌతుంది కనుక కుంకుమ పువ్వును ఫేస్‌ ప్యాక్‌గా ఉపయోగించవచ్చు. ప్రసవ సమయంలో కండరాల సడలింపుకు ఉపయోగంగా ఉంటుంది. మానసిక ఆందోళనలను నియంత్రిస్తుంది. కానీ తల్లిదండ్రుల జన్యువులే బిడ్డ శరీర రంగును నిర్ణయిస్తాయి కానీ కుంకుమపువ్వుకు ఏమాత్రం సంబంధం లేదు. కుంకుమ పువ్వును 10 మిల్లీగ్రాముల కంటే ఎక్కువగా ఆహారంగా తీసుకోకూడదు. అంతకంటే అధికంగా తీసుకుంటే గర్భాశయం సంకోచిస్తుంది.

సరైన ఆహార ప్రణాళిక కోసం చుట్టు ప్రక్కల వారి, పూర్వికుల సలహాలు వినకుండా వైద్యుడిని ఎల్లప్పుడూ సంప్రదించం మంచిది. ఆహార నియంత్రణ ఒక నియమంగా ఆచరించాలి.